టీడీపీ..వైసీపీలు దొందూ దొందే
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
అనంతపురం జిల్లా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీ పార్టీల నేతలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడులను ఏకి పారేశారు. ఒకరేమో అమరావతి రాజధాని పేరుతో కాలయాపన చేశారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ఆరోపించారు. మరొకరేమో నవరత్నాలు పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
కరవుకు కేరాఫ్ గా మారిన అనంతపురం జిల్లాపై తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోకస్ పెట్టారని , ఇక్కడి నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ఈ ప్రజలను బతికించు కోవాలంటే అభివృద్ది ఒక్కటే మార్గం అని నమ్మాడని , ఆయన ఆశయాలను సాధించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.
ప్రాజెక్టు అనంత సృష్టికర్త రఘువీరా రెడ్డి అని కొనియాడారు వైఎస్ షర్మిల. గత పదేళ్లుగా టీడీపీ, వైసీపీ దీని గురించి పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే 6.50 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.