నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయక పోవడం దారుణమన్నారు. ఇచ్చే ముందు ఆలోచించ లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
” ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ సామెతను తలపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసి, తీరా.. అమలు కొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
అప్పులు దొరకవని, ఆదాయం పెంచు కోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్పడం దేనికి నిదర్శనమని మండిపడ్డారు.. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని..? వీటిని అమలు చేయాలంటే తెలియదా ఏటా రూ.2 లక్షల కోట్లు అవసరం ఉందని..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.