ఏపీని అదానీ ప్రదేశ్ గా మార్చిన జగన్
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరోసారి తన సోదరుడు మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్, అదానీ లంచం వ్యవహారం బయట పడడంపై స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అదానీకి ఏపీని బ్లాంక్ చెక్కులా రాసి ఇచ్చాడని ధ్వజమెత్తారు.
విచిత్రం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌ను “అదానీ ప్రదేశ్ “గా మార్చారని ఆరోపించారు షర్మిల. రూ.1750 కోట్ల లంచాలకు ఆంధ్ర ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని వాపోయారు. జగన్ అవినీతి ప్రపంచానికి తాకిందన్నారు.
ఇది వైఎస్సార్ కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి తీవ్ర అవమానకరమని అన్నారు. అగ్ర రాజ్యం బయట పెట్టే దాక అదానీ, జగన్ లంచాల గురించి తెలియ లేదన్నారు. అదానీ దేశ పరువు తీస్తే… జగన్ ఆంధ్ర రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు.
ఒక్క డీల్‌లో రూ.1750 కోట్లు లంచమా ? జగన్ రెడ్డీ మీకు ఆంధ్రరాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గుర్తుకు రాలేదా ? 17వేల కోట్ల సర్దుబాటు చార్జీలు. మీ లంచాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీకి తాకట్టు పెడతారా ? గుజరాత్‌లో ఇదే అదానీ యూనిట్‌కి రూ.1.99 పైసలు అమ్ముతున్నారు. ఆంధ్రలో మాత్రం రూ.2.49 పైసలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. రూ.1750 కోట్ల లంచం తీసుకొని ప్రజల నెత్తిన అదానీ పవర్ భారాన్ని మోపారు. 25 ఏళ్లు డీల్‌కి ప్రజలపై పడే భారం లక్ష కోట్లు. లంచాలు ఇస్తే ప్రజల మనోభావాలను తాకట్టు పెడతారా అంటూ నిలదీశారు వైఎస్ షర్మిల.
రాష్ట్రాన్ని అదానీకి జగన్ తాకట్టు పెట్టారు. కేవలం రూ.640 కోట్లకు గంగవరం పోర్టును అప్పనంగా అమ్మేశారని అన్నారు. రూ.9 వేల కోట్ల విలువ చేసే 10 శాతం వాటాను కేవలం రూ.640 కోట్లకు అమ్మడం ఏంటి ? కృష్ణపట్నం పోర్టు బెదిరించి అదానీకి ఇప్పించారని ధ్వజమెత్తారు.
విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్ ను రద్దు చేయండి. అదానీ కంపెనీని ఏపిలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి. జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలను రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు.