ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. విశాఖ ఉక్కును ఉద్ధరిస్తున్నామని కేంద్రం చెప్తున్నవన్నీ అసత్యాలేనని అన్నారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్రానికి ఉండేది ఎన్నటికీ సవతి తల్లి ప్రేమనేంటూ మండిపడ్డారు. కన్నడ ఉక్కు మీదున్న ప్రేమ మోడీకి ఆంధ్రుల హక్కు మీద లేదని ఆరోపించారు. విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయని వాపోయారు.
విజయవాడలో వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోడీ దోస్తులకు పదో పరక కింద అమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రైవేటీకరణ లేదు అంటూనే రూపాయి సహాయం చేయకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్రలకు తెర లేపారంటూ ఆరోపించారు.
ప్లాంట్ ను చంపేసే కుట్ర కేంద్రం చేస్తూనే ఉందని ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి రూ.15 వేల కోట్ల సహాయం అందించారని, సదరు సంస్థను బతికించారని కానీ వైజాగ్ స్టీల్ కు ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదన్నారు.
243 మంది పనిచేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్రానికి.. 26 వేల మంది పని చేసే విశాఖ స్టీల్ ను ఆదుకోవడానికి మనసు రాలేదన్నారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం ఉండే JD(S)కు రూ.15 వేల కోట్లు నిధులు రాబట్టుకుంటే మరో వైపు ఎన్డీఏకు ఊపిరి పోసిన టీడీపీ, జనసేన పార్టీల ఎంపీలు మోడీకి వంగి వంగి సలాం చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు.