NEWSANDHRA PRADESH

సైకో అరెస్ట్ ను స్వాగ‌తిస్తున్నా – వైఎస్ ష‌ర్మిలా

Share it with your family & friends

వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డిపై ఏపీపీసీసీ చీఫ్ ఫైర్

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె త‌న‌పై, త‌న త‌ల్లిపై, త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌ను , కుటుంబాన్ని టార్గెట్ చేయ‌డంపై మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. సమాజానికి మంచి చేసేది సోషల్ మీడియా. అలాంటి వ్యవస్థను కొంత మంది సైకోలు, సైకో పార్టీలతో కలిసి ఉచ్ఛం నీచం లేకుండా భ్రష్టు పట్టించారని ఆరోపించారు.

మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారని మండిప‌డ్డారు ఏపీ పీసీసీ చీఫ్‌. మహిళలు అనే జ్ఞానం లేకుండా ఇంట్లో తల్లి, అక్కా, చెల్లి కూడా సాటి మహిళా అనే ఇంగితం లేకుండా , రాష్ట్రంలో ప్రశ్నించే మహిళలపై అసభ్యకరంగా పోస్టులతో, వికృత చేష్టలతో రాక్షస ఆనందం పొందారని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సోషల్ సైకోల బాధితుల్లో తాను ఒక దానిన‌ని పేర్కొన్నారు.

అసభ్యకర పోస్టులతో ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెట్టీ ..పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. నా మీద, అమ్మ మీద, సునీత మీద విచ్చలవిడిగా పోస్టులు పెట్టారని వాపోయారు.

అంతే కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పుట్ట లేదని అవమానించారని అన్నారు. నా ఇంటి పేరు మార్చి శునకానందం పొందారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై తాను కూడా పోలీస్ కేసు పెట్టానని అన్నారు. అటువంటి సైకో అరెస్టును స్వాగతిస్తున్నామ‌ని తెలిపారు.

అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం అని స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.