ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు రైజింగ్ స్టేట్ కానీ వైద్య సేవలకు దిక్కు లేదన్నారు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేకుండా పోయిందన్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గు చేటు అన్నారు. గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా ఉండడం దారుణమన్నారు.వైద్య సేవలు ఆపేదాక చూడటం అంటే, ఆరోగ్యశ్రీ పై సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతుందన్నారు.
పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే ఇదంతా అంటూ తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచే ఆరోగ్యశ్రీ అనారోగ్య శ్రీగా మారిందన్నారు.పేదోడికి వైద్యం అందని ద్రాక్షగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలను విస్తృత పరుస్తామని, వైద్యానికి గ్లోబల్ సిటీగా చేస్తామని ఇప్పటి దాకా సీఎం చంద్రబాబు చెప్పిన మాటలన్నీ సొల్లు కబుర్లేనంటూ తేలి పోయిందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ముందు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయండన్నారు. ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టినా అవి చెల్లించాల్సిన బాధ్యత మీదే అని తెలుసు కోవాలన్నారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.