బాబు..జగన్ ఇద్దరూ ఒక్కటే – షర్మిల
లిక్కర్ దందాకు తెర లేపారని ఆవేదన
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మద్యం విషయంలో జగన్‌కి, చంద్రబాబుకి పెద్ద తేడా లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలను అమాంతం పెంచేసి లిక్కర్ మాఫియాను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు.
గురువారం వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో కేవలం క్యాష్ ద్వారానే నాసిరకం మద్యం అమ్మి దోచుకున్న వేల కోట్ల రూపాయలు ఎటు పోయాయో తెలియదన్నారు. అంతే కాకుండా జగన్ పాలనలో లిక్కర్ మాఫియా అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిస్తే.. బాబు పాలనలో నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల చేతుల్లో లిక్కర్ మాఫియా నడుస్తోందని మండిపడ్డారు.
ఇద్దరికీ పెద్ద తేడా లేదన్నారు. అందరూ మాఫియా డాన్‌లే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దొందు దొందే. మంత్రి లోకేష్ ప్రధాని మోడీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారట అంటూ ఎద్దేవా చేశారు. 21 మంది ఎంపీలు ఇస్తామని చెప్పి ఇచ్చారట. అయ్యా లోకేష్ గ… మీరు ఇచ్చిన మాట సరే…మోడీ ఇచ్చిన మాట పరిస్థితి ఏంటి..? అని నిలదీశారు వైఎస్ షర్మిల రెడ్డి.
రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీలు అందరూ మోడీకి ఊడిగం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో లక్షలాది ప్రజల ముందు పీఎం మాట ఇచ్చారని, ఆ మాట ఏమైందని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 2 వేల పరిశ్రమలు రాగా.. హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 10 వేల పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. పోలవరం పూర్తి చేస్తా అన్నారు. అమరావతిని న్యూఢిల్లీని మించిన రాజధానిని చేస్తా అన్నారు. చివరకు మట్టి కొట్టి పోయారంటూ ఆరోపించారు.