జగనన్న పాలన అధ్వాన్నం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని, రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. యువత మొత్తం నిరాశలో ఉన్నారని, ఇప్పటి వరకు ప్రకటించిన ఉద్యోగాల ఊసే లేదని మండిపడ్డారు.
ప్రధానంగా ఏపీలో యువకులకు న్యాయం జరగడం లేదని ఆవేదన చెందారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఇయర్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన సీఎం ఎందుకు ప్రకటించ లేక పోయారంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను తప్పారంటూ మండిపడ్డారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు కేవలం కొన్ని వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని ధ్వజమెత్తారు.
ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, జగన్ రెడ్డి పాలనపై భగ్గుమంటున్నారని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఏపీపీఎస్సీ ద్వారా అన్ని భర్తీ చేస్తా అన్నారని కానీ ఇచ్చిన హామీల్లో 2 శాతం కూడా భర్తీ కాలేదంటూ ఎద్దేవా చేశారు.
మెగా డీఎస్సీ వేస్తానని అన్నారని కానీ అది పూర్తిగా యువతను మోసం చేసే దగా డీఎస్సీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కావాల్సిన వాళ్లకు వాలంటీర్ల పేరు చెప్పి నింపుకున్నారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. నిలదీస్తే తమను ఉగ్రవాదుల్లాగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.