ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓ వైపు అకాల వర్షాల కారణంగా ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలన్నీ నాశనం అయ్యాయని వాపోయారు. ఆదు కోవాల్సిన కూటమి సర్కార్ పట్టించుకోక పోవడం దారుణమన్నారు.
సాగర్ కుడి కాలువ ఆయకట్టు కింద సాగు నీరు వచ్చిందని సంతోష పడేలోపే వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం 4 లక్షల మంది రైతుల పాలిట శాపంలా మారిందన్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచడంలో కూటమి పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు వైఎస్ షర్మిల.
రైతుల ఆశలను పూర్తిగా అవిరి చేస్తున్నారని వాపోయారు. పోలీసులను కాపలాగా పెట్టి టోకెన్లు ఇవ్వడం ఏంటి అంటూ ప్రశ్నించారు. పదో పరకో ఇచ్చి కౌంటర్లు మూసి వేయడం దారుణమన్నారు. రైతులు అడిగింది కాకుండా సర్కారుకు నచ్చిన విత్తన రకం కొనాలని ఒత్తిడి చేయడంలో ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్.
మహిళలు అని చూడకుండా విత్తనాల కోసం వర్షంలో నిలబెడతారా ? తొక్కిసలాట జరుగుతుంటే చోద్యం చూస్తారా ? రైతు పక్షపాతి అని చెప్పుకొనే కూటమి సర్కారుకి ఇది తగునా అని నిలదీశారు. 10 రోజులుగా కాళ్లు అరిగేలా రైతులు విత్తన కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తుంటే కనపడటం లేదా అని మండిపడ్డారు.