పూజలు సరే పాలన సంగతి ఏంటి – షర్మిల
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. అసలు రాష్ట్రంలో పాలన అనేది ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాబు శాంతి హోమాలు, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు..జగన్ మోహన్ రెడ్డి దర్శనాలతో రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని వైఎస్ షర్మిల హితవు పలికారు. అందరూ కలిసి తిరుపతి లడ్డూకి మత రాజకీయాలు పులిమారంటూ సంచలన ఆరోపణలు చేశారు. లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని, జంతువుల ఆయిల్ కలిపారని, ఎన్డీబీబీ ఇచ్చిన రిపోర్ట్ సైతం పెట్టుకొని, చర్యలు తీసుకోవాల్సింది పోయి.. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు.
“జగన్ సర్కార్ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే…కూటమి సర్కార్ లడ్డూలో మత రాజకీయాలు కలిపింది “. క్రైస్తవుల చర్చిలో, ముస్లింల మజీద్ లో ఇలా జరిగితే ఊరుకుంటారా అంటే మతాలను రెచ్చ గొడుతున్నట్లే కదా అర్థం అన్నారు.
మత ఘర్షణలు జరగాలని హిడెన్ అజెండా పెట్టుకున్నట్లే కదా అర్థం. ప్రశాంతమైన ఏపీలో మత కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నట్లే కదా అర్థం చేసుకోవాలన్నారు వైఎస్ షర్మిల. 120 కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని మొక్కుకున్న మోడీ ..ఇదే తిరుమలలో వివాదం జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
NDDB రిపోర్ట్ కనిపించలేదా ? CBI విచారణ చేయించడానికి మనసు రావడం లేదా ? హిందూ మతం మీద కుట్ర జరిగితే CBI దర్యాప్తులో ఆ విషయం తేలేది కదా ? కుట్ర నిజమే అయితే అది దేశ ద్రోహం అవుతుంది కదా ?
లడ్డూ విషయంలో మతోన్మాద చర్యలు కాదు. సవాళ్లు, ప్రతి సవాళ్లు అంతకన్నా కాదు. దీక్షలు, ప్రమాణాలు అసలే కాదు. మాకు నిజం కావాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవాళ లేఖ రాశామన్నారు. లడ్డూ వివాదాన్ని సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయించాలని కోరామన్నారు.