చంద్రబాబు 100 రోజుల పాలన నూటికి సున్నా
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా
విజయవాడ – ఏపీలో చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనపై సీరియస్ కామెంట్స్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 100 రోజుల పాలన నూటికి సున్నా మాత్రమే వచ్చిందన్నారు. ఆయన పాలనా పరంగా ఫెయిల్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు.
తన పాలనలో చంద్రబాబు చేసింది ఇప్పటి వరకు కేవలం వైఎస్సార్ విగ్రహాలను, వైఎస్ఆర్ పేర్లను తొలగించడానికే సరి పోయిందన్నారు. 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ అని చెప్పాడని, అద్భుతం జరగ బోతోందంటూ నమ్మించాడని చివరకు చేతులెత్తేశాడంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి.
100 రోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతాం అన్నాడు కానీ అట్టర్ ప్లాప్ అయ్యాడని అన్నారు. సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదన్నారు ఏపీపీసీసీ చీఫ్. ఒక మోస పూరిత ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారం ఇస్తే..నమ్మకాన్ని నిలబెట్టుకునే భాధ్యత ఉండాలి కదా అని ప్రశ్నించారు .
అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేలు అన్నాడు…ఎప్పుడు ఇస్తారో తెలియదు. కనీసం 7 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వ లేక పోవడం దారుణమన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. నిరుద్యోగులకు 20 లక్షల ఉపాధి అవకాశాలు అన్నాడు. లేకుంటే 3 వేల నిరుద్యోగ భృతి అన్నాడని, ఉపాధి లేదు…భృతి ఎక్కడుందో తెలియడం లేదన్నారు.
తల్లికి వందనం కింద 15 వేలు ఇస్తామన్నారు, ఎంత మంది బిడ్డలు అంటే అన్ని 15 వేలు అన్నాడు. ఈ ఏడాది ముగుస్తుంది..దీని మీద అసలు స్పందనే లేదంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి. 3 సిలిండర్లు లేవు… ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎక్కడుందన్నారు. 250 కోట్లు విలువ చేసే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అని నిలదీశారు .