తిరుమల లడ్డూపై బాబు కామెంట్స్ తగదు
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉన్న చంద్రబాబు తిరుమల పవిత్ర స్థలంపై, అక్కడ తయారు చేస్తున్న ప్రసాదాలపై నోరు పారేసు కోవడం పట్ల మండిపడ్డారు. ఇది బాబు స్థాయికి తగదన్నారు. ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
తిరుమలపై తెలుగుదేశం పార్టీ, వైసీపీ రాజకీయాలు చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిలా రెడ్డి. తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా కామెంట్స్ చేయడం దారుణమన్నారు.
సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే… తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని అన్నారు. లేదా CBI తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నట్లు తెలిపారు వైఎస్ షర్మిలా రెడ్డి.