ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది సీఎం తీరు చూస్తుంటేనని అన్నారు. రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధికే దిక్కు లేదని, పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం ఎందుకంటూ ప్రశ్నించారు. అందులో అద్భుత ప్రపంచం కడతానని, అర చేతిలో వైకుంఠం చూపించడం బాబుకే చెల్లిందన్నారు. AI పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబు గారికే తెలిసిన విద్య అంటూ ఎద్దేవా చేశారు.
రాజధాని విస్తరణ పేరుతో, విలువైన రైతుల భూములను మళ్ళీ అగ్గువకే కాజేసి, తన అనుయాయులకు కట్టబెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసే కుట్ర తప్పా మరోటి కాదన్నారు వైఎస్ షర్మిల. కూటమి ప్రభుత్వానికి భూ దోపిడిపై పెట్టే శ్రద్ధ.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదన్నారు. సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి అసలే లేదన్నారు. రాజధాని విస్తరణకు భూములు సేకరించడం తప్పు కాదన్నారు. కానీ సేకరించిన 34 వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ అని ప్రశ్నించారు. కూలిపోయే స్థాయిలో ఉన్న తాత్కాలిక కట్టడాలు , ఎటు చూసినా పడావుబడిన భూములు ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ మండిపడ్డారు.
సింగపూర్ తలదన్నే ఆకాశ హర్మ్యాలు ఎక్కడ ? రాజధానిని ముందు నిలబెట్టకుండా.. ఒక రూపం అంటూ తీసుకురాకుండా..చిత్రాలతో విచిత్రాలు చేస్తూ.. ఇప్పుడే 44 వేల ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేజ్ 1 లో సేకరించిన 34 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు మిగలడం ఏంటి ? సీడ్ క్యాపిటల్ కి పోను మిగిలిన 20 వేలకు పైగా ఎకరాలు, 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరికిచ్చారంటూ ప్రశ్నించారు. 34 వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.