జగన్..పవన్..బాబు ఒక్కటే
ఎవరికి ఓటు వేసినా బీజేపీకే
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె నగరిలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి నగరిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. పాలన గాడి తప్పిందని, నవ రత్నాల పేరుతో జనాన్ని మోసం చేశారని ఆరోపించారు. 25 వేలకు పైగా టీచర్ పోస్టులుంటే ఎందుకని 6 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వైఎస్ ఆశయాలను గాలికి వదిలేసిందన్నారు. ఎన్నికల సమయంలో తన తండ్రి ఫోటోను పెట్టుకున్నారని, అధికారంలోకి వచ్చాక ఆయనను మరిచి పోయారంటూ మండిపడ్డారు షర్మిలా రెడ్డి.
వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే ఎన్నికలప్పుడు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మడమ తిప్పడం కాదన్నారు. వైయస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే ప్రజా సంక్షేమాన్ని కోరుకోవడం, యువత బంగారు భవిష్యత్తు కోసం పని చేయడం, రైతును రాజు చేయడం, మహిళలకు స్వయం సమృద్ధి కల్పించడం అన్నారు.
కానీ జగనన్న ప్రభుత్వం ఇవన్నీ గాలికొదిలేసి కేంద్రంలో ఉన్న బీజేపీతో డ్యూయేట్లు పాడుతోందంటూ సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం జగనన్న, చంద్రబాబు కృషి చేసింది ఏమీ లేదన్నారు.