మోడీ అంటేనే మోసం ఏపీకి శాపం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె ఏపీలో కొలువు తీరిన ఎన్డీయే సర్కార్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏకి పారేశారు. శుక్రవారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి టీడీపీ విరుద్దమైన ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ముందు మీ వైఖరి ఏమిటో తెలియ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు దానిని కాపాడుకుంటూ వచ్చిందన్నారు. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ, వ్యాపారవేత్తల కన్ను విశాఖ స్టీల్ పై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అప్పగించుకుంటూ పోతున్న మోడీకి దీనిపై ప్రేమ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.
గత 10 సంవత్సరాల నుంచి మోడీ ఏపీని మోసం చేస్తూనే వస్తున్నారని, ఆయన ఏపీకి న్యాయం చేస్తారంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. వైజాగ్ స్టీల్ కోసం వైఎస్ఆర్ పాటు పడితే గత ఐదేళ్లు జగన్ దాని కోసం ఎలాంటి చర్యా తీసుకోలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం విరుద్ద ప్రకటనలు చేయిస్తున్నాడని ఫైర్ అయ్యారు.