మోడీ డైరెక్షన్ పవన్ కళ్యాణ్ యాక్షన్ – షర్మిల
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ కామెంట్
విజయవాడ – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ పై సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
స్టీల్ ప్లాంట్ పై భారతీయ జనతా పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. త్వరలో అఖిలపక్షంతో సీఎంను కలుస్తామన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
సెక్యులర్ పార్టీ జనసేన కాస్తా రైటిస్ట్ పార్టీ అయి పోయిందంటూ ఎద్దేవా చేశారు. మోడీ డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ యాక్షన్ చేస్తున్నాడని ఆరోపించారు. తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తును ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
విశాఖ స్టీల్ పై చంద్రబాబు గతంలో లేఖ రాసి ఇచ్చిన విషయం మరిచి పోయారా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తాం అని సంతకం కూడా పెట్టారని గుర్తు చేశారు ఏపీ పీసీసీ చీఫ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. యూపీఏ హయాంలో లాభాల్లో ఉన్న ప్లాంట్ ను ఎన్డియే హయాంలో బలహీనం చేశారని ఆరోపించారు. అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ వేషం, భాష మారి పోయాయని మండిపడ్డారు. పవన్ కు అంత సీన్ లేదన్నారు.