రాష్ట్రాన్ని నాశనం చేసిన బాబు..జగన్
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
గుంటూరు జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా చీరాల, బాపట్ల, తెనాలి నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఏపీని గతంలో పాలించిన చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం కొలువు తీరిన జగన్మోహన్ రెడ్డిలు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. బాబు, పవన్, జగన్, పురందేశ్వరిలు భారతీయ జనతా పార్టీకి బానిసలంటూ మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ కూటమిలో ఎవరికి ఓటు వేసినా చివరకు ఆ ఓటు వెళ్లేది భారతీయ జనతా పార్టీకేనంటూ ఎద్దేవా చేశారు.
తన తండ్రి, మహా నాయకుడు వైఎస్ఆర్ పేరు చెప్పుకుని, తానే వారసుడినంటూ ప్రగల్భాలు పలికి పవర్ లోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.