నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై అన్నీ అబద్దాలే చెబుతున్నారంటూ ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ఇలా ప్రజలను నమ్మించాలని అనుకోవడం దారుణమన్నారు. మసి పూసి మారేడు కాయ చేసినట్లు నిజాలను దాచి పెడుతున్నారంటూ మండిపడ్డారు. 194 TMCల నీటి నిల్వ సామర్థ్యం నుంచి 114 TMCలకు పరిమితం చేశారని ఆవేదన చెందారు. ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని ఫైర్ అయ్యారు.
22 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణకు, 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించే మహానేత YSR నిర్ధేశిత లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్. 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని YSR అనుకుంటే.. 41.15 మీటర్ల ఎత్తుకు కుదించి పోలవరంను మినీ రిజర్వాయర్‌గా మార్చుతున్నారని మండిపడ్డారు.
నీటి నిల్వకు తప్పా ఎందుకు పనికి రాని ప్రాజెక్టుగా చేస్తున్నారని వాపోయారు వైఎస్ షర్మిలా రెడ్డి. 41.15 మీటర్ల ఎత్తుకి రూ.30,436 కోట్ల బడ్జెట్ అంచనాలను కేంద్రం ఆమోద ముద్ర వేస్తే.. 45.72 మీటర్ల ఎత్తులో కట్టి తీరుతాం అని అసెంబ్లీ వేదికగా చెప్తున్నవి అవాస్తవాలు కావా అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు నాయుడును.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అయితే, ఎత్తు తగ్గింపు విషయం అవాస్తవం అయితే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో అధికారిక ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు సంబంధంచి డీపీఆర్ ను బయట పెట్టాలన్నారు.