NEWSANDHRA PRADESH

గుడ్డి గుర్రాల‌కు ప‌ళ్లు తోమారా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిల‌

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె మ‌రోసారి జ‌గ‌న్ స‌ర్కార్ ను టార్గెట్ చేశారు. ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉండాల‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు , ప్ర‌స్తుత రాజ్య‌స‌భ బ‌రిలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి పేర్కొన‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఏం చేశార‌ని నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిల.

ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయ‌లేక పోయార‌ని మండిప‌డ్డారు. ఇది పూర్తిగా మీ చేత‌కానిత‌నం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు.

రాష్ట్రానికి రాజధాని లేదు.ప్రత్యేక హోదా రాలేదు .ప్రత్యేక ప్యాకేజీలు లేవు. పోలవరం పూర్తి కాలేదు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదు. కొత్త పరిశ్రమలు లేవంటూ ఎద్దేవా చేశారు. .ఉన్నవి ఉంటాయో లేదో తెలియదని, ఏకంగా రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్ర ప్రదేశ్ చేశారే తప్పా…అభివృద్ధి చూపలేదన్నారు.

మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి నెల‌కొన‌డం బాధాక‌ర‌మ‌న్నారు.