నా ప్రచారంతో వైసీపీలో వణుకు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రచారంతో వైసీపీలో వణుకు ప్రారంభమైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏపీ న్యాయ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. తనకు మానవత్వం అన్నది లేకుండా పోయిందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. తాను కడప జిల్లాలో ప్రచారానికి శ్రీకారం చుట్టి కేవలం 5 రోజులు మాత్రమే అయ్యిందన్నారు.
నా ప్రచారంతో జిల్లాలోని వైసీపీలో కలకలం రేగిందని, ఒక రకంగా చెప్పాలంటే వణుకు పుడుతోందంటూ కామెంట్స్ చేశారు . దెబ్బకు ఇక్కడ పార్టీ పరంగా ఇప్పటికే ఎంపిక చేసిన , తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు. స్వంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిన ఆయనకు సీటు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఏ ప్రాతిపదికన టికెట్ కేటాయించారో ప్రజలకు జగన్ మోహన్ రడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా నాయకులుగా వైఎస్సార్, వైఎస్ వివేకానంద రెడ్డిలు గుర్తింపు పొందారని గుర్తు చేశారు. వాళ్లు ఎప్పుడు పిలిచినా వెళ్లే వారని అన్నారు.