NEWSANDHRA PRADESH

బియ్యం స‌రే అదానీపై విచార‌ణ ఏదీ..?

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఏపీ స‌ర్కార్ పై మండిప‌డ్డారు. రేష‌న్ బియ్యం స్కాంపై సిట్ వేశార‌ని..మ‌రి రూ. 1750 కోట్ల ముడుపుల వ్య‌వ‌హారంపై గౌత‌మ్ అదానీపై ఎందుకు విచార‌ణ‌కు ఆదేశించ‌డం లేదంటూ నిప్పులు చెరిగారు. వైఎస్ ష‌ర్మిల శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

సీఎం చంద్ర‌బాబు నాయుడు మౌనంగా ఉండ‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు కామ్ గా ఉన్నారో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషక‌ర‌మ‌న్నారు.

బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారని నిల‌దీశారు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే , నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? మీరు కూడా అదానీకి అమ్ముడు పోయారా? అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తీగ లాగితే జ‌గ‌న్ తో పాటు, అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయ పడుతున్నారా? నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారంటూ నిల‌దీశారు.

TDP ప్రతిపక్షంలో ఉండగా.. SECIతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారని, టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. గుజరాత్ లో రూ 1.99 పైసలు దొరికే సోలార్ విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎలా కొన్నారని ఉద్యమాలు చేశారు.

25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని చెప్పారు. ఇది ప్రజలను అదానీ కోసం నిలువునా దోచి పెట్టడం అని చెప్పారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారు. తాము అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మరి ఇప్పుడేమైంది చంద్రబాబు అంటూ ప్ర‌శ్నించారు.