మెగా డీఎస్సీ పేరుతో భారీ మోసం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీఎస్సీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. నవ రత్నాలు పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారంటూ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని మాటిచ్చిన జగన్ ఎందుకు ప్రకటించ లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొవ్వూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న రచ్చబండ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిల ప్రసంగించారు.
జగనన్న మాట తప్పను మడమ తిప్పను అంటూ అధికారంలోకి వచ్చారని, కానీ యూ టర్న్ తీసుకున్నారంటూ సెటైర్ వేశారు. సీఎం పీఠంపై కూర్చున్నాక వాటిని మరిచి పోయారని దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను నిట్ట నిలువునా మోసం చేశారని ఆరోపించారు.
నిరుద్యోగుల అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో దళితుల మీద దాడులు పెరిగిపోయాయని ఇది మంచి పద్దతి కాదన్నారు. బెదిరించడమే కాదు ఎదురు తిరిగితే హత్యలు చేస్తున్నారని ఆరోపించారు.
సాక్షాత్తు రాష్ట్ర హోమ్ మంత్రి దళితురాలై ఉండి కూడా దళితులపై దాడులను ఆపలేక పోతున్నారని ఆవేదన చెందారు. ఇంకా ఆ పదవిలో ఉండి ఏం ఉపయోగమని ప్రశ్నించారు.