ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం
స్పష్టం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మరోసారి ఏపీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ రాష్ట్రానికి ఊపిరి లాంటిదని చెప్పారు.
హోదాను సాధించు కోవాలని అనుకుంటే మనందరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అయితే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు మనం గొర్రెల్లాగా ఉండొద్దు.. సింహాల్లా పోరాడాలని అన్నారు.
నారా చంద్రబాబు నాయుడును,జగన్‌ను నమ్ముకుని పదేళ్లుగా గొర్రెల్లాగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి అయినా సింహాల్లాగా గర్జించాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం మనం సింహాల్లా పోరాడి సాధించు కోవాలని పిలుపునిచ్చారు వైఎస్ షర్మిల.
ప్రతి కాంగ్రెస్ నేత, కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి బీజేపీ, వైసీపీ, టీడీపీ చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. బీజేపీతో వారు చేస్తున్న చీకటి పొత్తులను బహిర్గతం చేయాలని అన్నారు. ఈ దేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ మాత్రమేనని స్పష్టం చేశారు.