కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా
ప్రకటించిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
కాకినాడ – రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, నవ రత్నాలు పేరుతో ప్రజల్ని మోసం చేశారంటూ నిప్పులు చెరిగారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఎన్నికల ప్రచారంలో భాగంగా తునిలో జరిగిన సభలో ప్రసంగించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నారు ఎక్కడుందని ప్రశ్నించారు. వేలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారని, డీఎస్సీ పేరుతో దగా చేశారంటూ ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల.
ప్రజలు జగన్ రెడ్డి పాలనను ఈసడించు కుంటున్నారని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టుకున్న మాత్రాన ప్రజలు జగన్ రెడ్డిని నమ్మే స్థితిలో లేరన్నారు. తనపై లేని పోని ఆరోపణలు చేయడం, విమర్శలు గుప్పించడం, చివరకు నీచమైన వ్యక్తిగత దాడులకు తెగ బడటం చూస్తే వైసీపీ నేతలు, శ్రేణులు ఒత్తిడిలో ఉన్నట్లు అర్థం అవుతోందన్నారు.
ఇవాళ రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా అది భారతీయ జనతా పార్టీకి వేసినట్టేనని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పురందేశ్వరి అంతా ఒక్కటేనని వీరిలో ఏ ఒక్కరు కూడా ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు వైఎస్ షర్మిల.