డబ్బులు ఇస్తే తీసుకోండి
ఓటు నాకు వేయండన్న షర్మిల
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ న్యాయ యాత్ర సందర్బంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కడప జిల్లా జమ్ములమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్లలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇక్కడే క్యాంబెల్ లోని ఆస్పత్రిలో తాను పుట్టానని అన్నారు. ఏ పార్టీ వారు వచ్చినా , ఎంత ఇచ్చినా తీసుకోండి అని కానీ తనకు మాత్రం ఓటు వేయడం మరిచి పోవద్దని కోరారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఈసారి వైఎస్సార్ సీపీ వాళ్లు ఓటుకు నోటు బాగా ఇస్తారని, ఎందుకంటే మీ నుంచి వాళ్లు దోచుకున్నారని ఆరోపించారు. అదంతా అవినీతి డబ్బేనని చెప్పారు. ఎవరికి ఓటు వేస్తే మన భవిష్యత్ మారుతుందో ఆలోచన చేయండి అని కోరారు.
తమ వద్ద అవినీతి డబ్బు లేదని, కేవలం న్యాయం మాత్రమే ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఈ నియోజకవర్గానికి ఎన్నో హామీలు ఇచ్చారని కానీ ఒక్కటి కూడా అమలు కాలేదని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులను , ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని సీఎం చెప్పారు. కానీ అది కూడా మరిచి పోయారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్టేనని స్పష్టం చేశారు.