జగన్ ఖేల్ ఖతం – షర్మిల
చిన్నాన్న హత్యలో పాత్ర ఎవరిది
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె మరోసారి తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. గొడ్డలితో రాజకీయం చేస్తున్నది ఎవరో జనానికి తెలియదని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసే వాళ్లు గత చరిత్ర తెలుసుకుంటే మంచిదని సూచించారు.
చిల్లర రాజకీయాలు మానుకోక పోతే ప్రజలే తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు వైఎస్ షర్మిల. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కడప లోక్ సభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఆమెతో పాటు దివంగత ఎంపీ, వైఎస్ వివేకానంద రెడ్డి తనయురాలు, డాక్టర్ సునీతా రెడ్డి కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్నేళ్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పాలన సాగించిన జగన్ మోహన్ రెడ్డికి, ఆయన పరివారానికి టైం దగ్గర పడిందన్నారు. ఆయనను విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.