నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
కడప జిల్లా – తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడినంటూ పవర్ లోకి వచ్చిన జగన్ రెడ్డి ఆశించిన మేర పాలన సాగించడం లేదని మండిపడ్డారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రజా న్యాయ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైదుకూరులో జరగిన సభలో ప్రసంగించారు. జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. వైఎస్సార్ ఆశయాలను తుంగలో తొక్కిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
రాష్ట్ర అభివృద్ది గురించి పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. మద్య నిషేధం చేస్తానని ప్రకటించాడని కానీ దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రత్యేక హోదా అన్నాడు, చివరకు మోదీకి, బీజేపీకి బానిసగా మారి పోయాడంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి.
పోలవరం కడతానని అన్నాడని, ఇప్పటి వరకు ఒక్క రాయి కూడా ఎత్తింది లేదన్నారు. రాష్ట్రానికి కనీసం చెప్పుకునేందుకు రాజధాని లేకుండా చేశాడని ఇక సీఎంగా ఎలా పనికి వస్తాడంటూ ప్రశ్నించారు ఏపీ పీసీసీ చీఫ్. మాట మీద నిలబడే నైజం వైఎస్సార్ ది అని, కానీ మాట ఇవ్వడం తప్పడం జగన్ కు అలవాటుగా మారిందంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.