ఏపీలో డ్రగ్స్ దే రాజ్యం
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ అనే వారని కానీ ఇవాళ సవాలక్ష అవలక్షణాలకు కేరాఫ్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఉండేదన్నారు. కానీ ఇవాళ డ్రగ్స్ కు అడ్డాగా మారడం తనను కలిచి వేసిందన్నారు. ఇదేమి పాలనో జగన్ రెడ్డి ప్రజలకు చెప్పాలన్నారు. క్వింటాళ్ల కొద్ది డ్రగ్స్ దొరకడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు.
శనివారం వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఇలా ఏది కావాలంటే అది సప్లై చేసే ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ మారి పోయిందని మండిపడ్డారు. అసలు సీఎం జగన్ రెడ్డి ఈలోకంలో ఉన్నారా అని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల.
ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపి వైపే ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ డ్రగ్స్ కు , మాఫియాకు ఏపీని కేరాఫ్ గా మార్చేశారంటూ ధ్వజమెత్తారు. 25 వేల కేజీల డ్రగ్స్ విశాఖకు చేరితే తమది కాదంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంపై మండిపడ్డారు షర్మిల.