కూటమి..వైసీపీని జనం నమ్మడం లేదు
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె సమీక్ష చేపట్టారు. రాబోయే రోజుల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై పార్టీకి చెందిన జిల్లాల అధ్యక్షుడు, మండలాల కన్వీనర్లు, ఇతర బాధ్యుతలతో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీని బలోపేతం చేయడంపై దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు.. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమీక్ష సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ రాష్ట్రంలో క్రెడిబులిటి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. మత రాజకీయాలు చేస్తున్నందుకు బీజేపీ, హామీలిచ్చి మోసం చేసినందుకు వైసీపీ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చేతులెత్తేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు క్రెడిబులిటి లేదని ప్రజలకు అర్థమైందన్నారు.
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబులిటితో వారి సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేయాలని, వారిలో భరోసా నింపే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని, నియోజకవర్గాల వారీగా ప్రతి వారం రెండు సార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి క్యాడర్‌లో నూతన ఉత్తేజం నింపాలని కార్యవర్గానికి సూచించారు వైఎస్ షర్మిలా రెడ్డి.