చంద్రబాబు..జగన్ ఇద్దరూ ఒక్కటే – షర్మిల
ఏపీపీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
కాకినాడ జిల్లా – పాలనా పరంగా ఎవరు ఏలినా ఏపీకి శాపం తప్ప ఒరిగింది ఏమీ లేదని మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. గురువారం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు .
ఏలేరు ఆధునీకరణపై దివంగత వైఎస్సార్ కు ఉన్న చిత్తశుద్ది చంద్రబాబు, జగన్ రెడ్డికి లేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఎకరాకు రూ. 10 వేలు కాదు రూ. 25 వేలు తక్షణమే పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏలేరు రైతులను నిండా ముంచిందని, వేల ఎకరాలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలేనంటూ ఫైర్ అయ్యారు. ఏలేరు మరమ్మత్తుల మీద ఎవరు దృష్టి పెట్ట లేదని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
మరమత్తులు లేక రైతులు దారుణంగా నష్ట పోయారని, ఒక్కో రైతు ఇప్పటి వరకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టారని , ఏ ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలు అయ్యిందన్నారు.
వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారని, రూ. 135 కోట్లు కూడా విడుదల చేసి పనులు చేపడితే..ఆ తర్వాత పవర్ లోకి వచ్చిన చంద్రబాబు , జగన్ రెడ్డి దృష్టి సారించ లేదని ధ్వజమెత్తారు.
ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని, ఈ ఇద్దరిదీ తప్పేనని అన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారని, తట్టెడు మట్టి కూడా తీయ లేదన్నారు .