రైతులను నిండా ముంచిన జగన్
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అనంతపురం జిల్లా – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె తన సోదరుడు, వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చాడని, ఆ తర్వాత ఆయన ఆశయాలకు గండి కొట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు సీట్లు ఇచ్చే సంస్కృతికి తెర తీశాడని ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల.
రాష్ట్రంలో పాలన పడకేసిందని, నాలుగున్నర ఏళ్లుగా నిద్ర పోయాడని, ఇప్పుడు ఎన్నికలు వచ్చాక మేల్కొన్నాడని ఎద్దేవా చేశారు. ఏపీ న్యాయ యాత్రలో భాగంగా శుక్రవారం వైఎస్ షర్మిల శింగనమల, ఉరవకొండ నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మండు టెండలను సైతం లెక్క చేయకుండా తనను ఆశీర్వదించేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు వైఎస్ షర్మిల. . మహానేత వైఎస్సార్ రాయలసీమను సస్యశ్యామలం చేయాలని అనుకున్నారని చెప్పారు. హంద్రీనీవా వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అని అన్నారు .
అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్ట్‌ను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న జగనన్నకు.. అధికారంలోకి వచ్చాక పూర్తి చేయడం చేత కాలేదన్నారు. రైతులను జగన్ నిండా ముంచారని మండిపడ్డారు.. వైఎస్సార్ హయంలో వ్యవసాయం పండుగ లాగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు జగన్ పాలనలో సీన్ రివర్స్ అయ్యిందన్నారు.