వైసీపీ కామెంట్స్ షర్మిల సీరియస్
అసత్యాలు..అబద్దాలకు పార్టీ కేరాఫ్
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పరివారాన్ని, వైసీపీని ఏకి పారేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడారు. వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం మాను కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పచ్చ కామర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలా ఉంది వైసీపీ నేతల తీరు అంటూ ఎద్దేవా చేశారు.
సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు చంద్రబాబు సమాధానం చెప్పాలని తాము అడిగామని, తాము టీడీపీకి తోక పార్టీ అంటూ కామెంట్స్ చేయడంపై ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి.
నేతలకు కళ్ళుండి, వినడానికి చెవులు ఉండి, విజ్ఞత కలిగిన వాళ్ళే అయితే తాము ఏం చెప్పామో ఒకటికి పదిసార్లు వింటే అర్థం అవుతుందన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే , నిలదీస్తే అది కూటమి సర్కార్ కు కొమ్ము కాసినట్లు అవుతుందా అని ప్రశ్నించారు ఏపీ పీసీసీ చీఫ్. తాము అడిగాము కాబట్టే సర్కార్ తల్లికి వందనంపై వివరణ ఇచ్చిందన్నారు. సోయి లేకుండా మాట్లాడితే ప్రజలు ఊరుకోరని అన్నారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారంటూ మండిపడ్డారు వైఎస్ షర్మిలా రెడ్డి.