బాబు..జగన్ ఏపీకి ఏం చేశారు
నిలదీసిన వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. అమరావతి రాజధాని పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని, నవ రత్నాలు పేరుతో జగన్ రెడ్డి తానేమీ తక్కువ కాదంటూ ఎద్దేవా చేశారు. బాబు..జగన్ ఇద్దరూ ఒక్కటేనంటూ ఆరోపించారు .
మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని రాజకీయం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆయన పేరు చెబితే సంక్షేమం, అభివృద్ది గుర్తుకు వస్తుందన్నారు. కానీ చంద్రబాబు , జగన్ రెడ్డిల పేర్లు చెబితే మోసం, దగా, కుట్ర, దాడులు, దౌర్జన్యాలు గుర్తుకు వస్తాయంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల.
ట్విట్టర్ వేదికగా గురువారం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుటుందని స్పష్టం చేశారు. మార్చి 1న తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ చేయబోతున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై తాము తొలి సంతకం చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. చంద్రబాబు, జగన్ మోదీకి బానిసలుగా మారారని ఆరోపించారు.