ఆ నేతలు బీజేపీకి బానిసలు
వారిలో ఎవరికి ఓటు వేసినా ఆ పార్టీకే
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె ఏపీ సీఎం జగన్ రెడ్డితో పాటు టీడీపీ కూటమి నేతలను ఏకి పారేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పేరుకు పోయాయని కానీ వాటి గురించి ఎవరూ ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. ఎంత సేపు అధికారంలోకి ఎలా రావాలన్న ధ్యాస తప్ప జనం గోడు ఏనాడైనా పట్టించుకున్నారా అని నిలదీశారు వైఎస్ షర్మిల.
ఏపీ న్యాయ యాత్రలో భాగంగా ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా మడకశిరలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటు వేసినా అది నేరుగా బీజేపీకి వేసినట్టేనని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రజలు మారాలని కోరారు. లేక పోతే తీవ్రమైన ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.
జగన్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా తయారైందని, ఇక గతంలో పాలించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. చిన్నాన్నను హత్య చేసిన కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్ రెడ్డి ఎలా టికెట్ ఇస్తాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని లేదంటే అరాచకం కావాలంటే జగన్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు.
జగన్, చంద్రబాబు, పవన్ బీజేపీకి బానిసలంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు.