నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడని ఆరోపించారు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం డీఎస్సీ వేశారంటూ ధ్వజమెత్తారు షర్మిల.
ఆనాడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 52 వేల తో మెగా డీఎస్సీ వేశారని, కానీ ఆయన వారసుడినంటూ గొప్పలు చెబుతున్న జగన్ రెడ్డి కేవలం 6 వేల పోస్టులు మాత్రమే వేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఆమె ఈ సందర్బంగా సీఎంకు పలు ప్రశ్నలు సంధించారు. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఏమైందంటూ నిలదీశారు. 5 ఏళ్ల పాటు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు కాల యాపన చేశారో ప్రజలకు చెప్పాలన్నారు.
ఎన్నికలకు నెలన్నర ముందు కొన్ని పోస్టులనే ప్రకటించడం ఎందుకని ప్రశ్నించారు. టెట్,డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలని అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా అన్నారు.
టెట్ కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మధ్య కేవలం 6 రోజుల వ్యవధి మాత్రమేనా అని అన్నారు. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా అని మండిపడ్డారు.