నన్ను గెలిపిస్తే నేరుగా కలవచ్చు
అవినాష్ రెడ్డి గెలిస్తే జైలుకు వెళ్లాలి
కడప జిల్లా – తనను గెలిపిస్తే ప్రజల మధ్యనే ఉంటానని, నేరుగా ఏ సమయంలోనైనా వచ్చి కలవచ్చని స్పష్టం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కడప జిల్లా కమలాపురంలో ఏపీ న్యాయ యాత్ర చేపట్టారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి కావాలా లేక ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన వైస్సార్ బిడ్డ కావాలో తేల్చు కోవాలని అన్నారు వైఎస్ షర్మిల.
తనను గెలిపిస్తే ఎవరైనా , ఎప్పుడైనా కలిసేందుకు వీలు ఉంటుందన్నారు. కానీ అవినాష్ రెడ్డి గెలిస్తే మీరు జైలుకు వెళ్లి కలవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి తన మేనమామ అని , ఆ మాత్రం తన కోసం సాయం చేయలేడా అని ప్రశ్నించారు.
గత ఐదేళ్లుగా జగన్ రెడ్డి ఆయన పరివారం భారీ ఎత్తున దోచుకుందన్నారు. కానీ నా వద్ద డబ్బులు లేవని పంచేందుకని చెప్పారు. టీడీపీ కూటమి, వైసీపీ ఇచ్చిన డబ్బులను తీసుకోండి కానీ మీ విలువైన ఓటు తన కోసం వేయాలని కోరారు వైఎస్ షర్మిలా రెడ్డి.