న్యాయానికి నేరానికి మధ్య పోరాటం
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల రెడ్డి
కడప జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోరాటంగా ఆమె అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో పర్యటించారు.
బద్వేల్ నియోజకవర్గంలోని కాశీ నాయన, కలశపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, గోపవరం, బద్వేల్ టౌన్, అట్లూరు మండలాల్లో ప్రచారం చేపట్టారు. వైఎస్ షర్మిలకు అడుగడుగునా జనం బ్రహ్మ రథం పట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం మాఫియాకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మహా నాయకుడి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఇప్పడు ఆయన ఆశయాలకు తూట్లు పొడిచాడని ఆరోపించారు. జగన్ చుట్టూ భజన బృందం ఉందని, వారి వల్లనే ఆయన గాడి తప్పాడని ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల.
రాష్ట్రంలో ఎవరు గెలిచినా వారంతా మోదీకి లొంగి ఉండక తప్పదన్నారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే ప్రజలకు మేలు చేస్తుందని చెప్పారు .