నీ జ్ఞాపకం పదిలం నీ జీవితం చరితార్థం
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి విజయమ్మ నివాళి
కడప జిల్లా – దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ యెదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి వర్దంతి ఇవాళ. ఈ సందర్బంగా సోమవారం కడప జిల్లాలోని ఇడుపుల పాయలో వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ. కూతురు షర్మిల, కోడలు భారతి, కొడుకు జగన్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేశారు.
వైఎస్సార్ లేని లోటు తీర్చ లేనిదని పేర్కొన్నారు విజయమ్మ. ఆయన జ్ఞాపకం పదిలంగా ఉందని, వైఎస్సార్ చివరి దాకా ప్రజల కోసం బతికాడని అన్నారు. ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ మరిచి పోలేక పోతున్నారని ఇదంతా రెడ్డి వల్లనే సాధ్యమైందన్నారు.
ప్రజల మన్ననలు పొందారు. రేయింబవళ్లు జనం గురించే ఆలోచించారు. పేదలు ఇబ్బంది పడకూడదని నిరంతరం తపించారని గుర్తు చేసుకున్నారు విజయమ్మ. ఎందరో నేతలు వస్తుంటారు పోతుంటారు..కానీ వైఎస్సార్ లాంటి మహా నాయకుడు మళ్లీ పుట్టడు అన్నారు.
ఆయనకు భార్యనైనందుకు గర్వ పడుతున్నానని, వైఎస్సార్ ఆశయాల సాధన కోసం తనతో పాటు తమ కుటుంబం పాటు పడుతుందని స్పష్టం చేశారు వైఎస్ విజయమ్మ.