పార్టీ బలోపేతంపై జగన్ ఫోకస్
రేపే కీలక వైఎస్ఆర్సీపీ సమావేశం
తాడేపల్లి గూడెం – రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సమాయత్తం కానున్నారు పార్టీ బాస్, మాజీ సీఎం జగన్ రెడ్డి. ఈ మేరకు పార్టీ కీలక ప్రకటన చేసింది.
జగన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం డిసెంబర్ 4న బుధవారం జరుగుతుందని తెలిపింది. పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొంది. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలనే దానిపై బాస్ దిశా నిర్దేశం చేయనున్నారు.
ఈ కీలక సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలతో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమావేశం అవుతారు.
పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న అనేక ఇబ్బందులు, భారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వంపై ఆందోళనల నిర్వహణ.. తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.
సూపర్సిక్స్ హామీలు ఎగ్గొట్టిన వైనం, ధాన్యం సేకరణ సక్రమంగా లేకపోవడం, సేకరిస్తున్న ధాన్యానికి కూడా మద్దతు ధర ఇవ్వకపోవడం, అటు మిల్లర్లు ఇటు దళారులు కలిసి రైతులను దోచుకుంటున్న వైనంపైనా పోరాడే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చే వీలుంది.
ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ అందక రాష్ట్రంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు, అనారోగ్యం పాలైన ఆరోగ్యశ్రీతో పాటు, పేదలకు అత్యంత నష్టం చేకూరుస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంపై సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నారు.