ఎంపీలు మోపిదేవి..మస్తాన్ రావు రాజీనామా
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని షాక్
అమరావతి – వైఎస్సార్సీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదన్ మస్తాన్ రావు. బుధవారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
పార్లమెంట్ లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ కు రాజీనామా పత్రాలను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తమ రిజైన్ పత్రాలను ఇచ్చారు. రాజ్యసభ పదవితో పాటు పార్టీ సభ్యత్వ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు.
ఇద్దరు ఎంపీల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోపిదేవి కుడి భుజంలా వ్యవహస్తే.. బీద మస్తాన్ రావుపార్టీలో కీలక వ్యవహరించారు. ఇప్పుడు వీరిద్దరూ పార్టీకి రాజీనామా చేయడంతో కేడర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
నేతలే తమ దారి తాము చూసుకుంటుంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరూ అటు పదవికి, ఇటు పార్టీకి ఏకకాలంలో రాజీనామా చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా మోపిదేవి వెంకట రమణ గురువారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.