NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబు ప్ర‌చారం వైసీపీ ఆగ్ర‌హం

Share it with your family & friends

ప‌చ్చ మీడియా క్యాంపెయిన్ పై ఫైర్

అమరావ‌తి – వైసీపీ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. టీడీపీ చీఫ్‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఫేక్ ప్ర‌చారానికి తెర తీశాడ‌ని ఆరోపించింది. ఈ మేర‌కు గురువారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించింది. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది నారా చంద్ర‌బాబు నాయుడుపై.

తిరుమల ప్రసాదంపై తాను చేసిన కామెంట్లను హైలెట్‌ చేయాల్సిందిగా ఇప్పటికే అనుకూల మీడియాకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించింది వైసీపీ. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలను పట్టుకుని విషప్రచారం చేయాలన్నది వారి అజెండా అని పేర్కొంది.

ఇప్పటికే కొంతమంది ఎల్లో మీడియా ప్రతినిధులు తిరుమలకు వెళ్లే దారిలో ఉన్నారని, రానున్న కొన్ని రోజుల పాటు ఇదే అజెండా నడపనున్నారని వాపోయింది.

డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగమే తిరుమల ప్రసాదంపై నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించింది వైసీపీ. రోజురోజుకూ బలపడుతున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం నుంచి, విజయవాడ వరదల్లో సహాయక చర్యల వైఫల్యాల నుంచి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విమర్శల నుంచి, సర్కార్ బడిలో సీబీఎస్ఈ ఎత్తివేత అపవాదు నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికే ఈ ఎత్తుగడకు దిగారంటూ మండిప‌డింది.

కోట్లాది మంది హిందువుల మనో భావాలను తన మాటల ద్వారా చంద్రబాబు దెబ్బ తీసి పాపం మూట గట్టుకున్నారంటూ ఎద్దేవా చేసింది వైసీపీ.