వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల
రాష్ట్రంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేయడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరిగారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. హత్యలు, మానభంగాలు, కేసులు, అరెస్ట్ ల పర్వం కొనసాగుతోందన్నారు.
జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు చేసిన బాధితురాలు లక్ష్మిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. తనను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ కిరణ్ ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందన్నారు.
శ్యామల మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన వారిని పనిగట్టుకుని టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా బెదిరే ప్రసక్తి లేదన్నారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రచారం తప్పా పనులు చేయడంపై ఫోకస్ పెట్టడం లేదన్నారు.
కిరణ్ రాయల్ ను పార్టీకి దూరంగా ఉంచామని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు తనపై వేటు వేయలేదంటూ ప్రశ్నించారు శ్యామల. తమకు ఓ న్యాయం, ఇతరులకో న్యాయమా అని నిలదీశారు.