సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు
తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేపట్టండి
ఢిల్లీ – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ , ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన హయాంలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ చోటు చేసుకుందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హుటా హుటిన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తిరుపతి తిరుమల ఆలయంలో నాసి రకం నెయ్యి వినియోగిస్తున్నారనే ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ మేరకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ సమస్యను పరిశోధించడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా నిపుణుల నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన అభ్యర్థించారు. విచారణ చేపట్టాక నివేదిక వచ్చేంత వరకు తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా కామెంట్స్ చేయకూడదని కోరారు. దీని వల్ల తిరుమల ప్రతిష్ట మరింత దిగజారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.