పిలుపునిచ్చిన ఎనుముల రేవంత్ రెడ్డి
లండన్ – ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనం పుట్టిన ప్రాంతానికి సేవ చేయాల్సిన బాధ్యత ప్రవాస భారతీయులు, తెలుగు వారిపై ఉందని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఈ సందర్భంగా లండన్ ఎన్నారైల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ది అనేది పలు రూపాలలో ఉంటుందన్నారు. ప్రధానంగా వ్యవసాయం అనేది భారత దేశానికి, ప్రత్యేకించి తెలంగాణకు అత్యంత ముఖ్యమని గుర్తు పెట్టుకోవాలన్నారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతుల కష్టం ఏమిటో తనకు బాగా తెలుసన్నారు.
పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం అన్నది తమ ఎజెండాలో మొదటిదని స్పష్టం చేశారు. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతోందని, దానిని గుర్తు పెట్టుకుని వచ్చిన ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగానికి వాడాలని సూచించారు.
తెలంగాణకు చెందిన ఎందరో ప్రతిభావంతులు వివిధ రంగాలలో పని చేస్తున్నారని, వారందరినీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.