ఏపీకి అమరావతినే రాజధాని
ప్రకటించిన చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. సంక్రాంతి పర్వదినం సందర్బంగా జరిగిన సంబురాలలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తాడేపల్లి గూడెంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
అనంతరం కుటుంబంతో కలిసి తన స్వంత ఊరు నారావారి పల్లెకు వెళ్లారు. అక్కడ కనుమ పండుగలో పాల్గొన్నారు. అన్నదానం చేశారు. అనంతరం మీడియాతో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన విధంగా మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని చెప్పారు. ఏపీకి నిజమైన రాజధాని అమరావతినేనని వెల్లడించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని ఆరోపించారు.
పేదలు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. తాము పవర్ లోకి వస్తే మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని, యువతకు ఉపాధి కల్పిస్తామని, నూతన పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల జాబ్స్ వస్తాయన్నారు.