అభినందించిన ఏఐసీసీ
న్యూఢిల్లీ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానేనని ప్రశంసలు కురిపించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ , ఏఐసీసీ సోషల్ మీడియా చైర్మన్ సుప్రియా శ్రీనాటే.
న్యూఢిల్లీలో పార్టీకి సంబంధించిన సామాజిక మాధ్యమాల విభాగం ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం హాజరైంది. రాష్ట్రంలో గతంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీని ఎండగట్టడంలో, ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వడంలో, ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి రావడంలో మెరుగైన రీతిలో పని చేశారంటూ ఏఐసీసీ సోషల్ మీడియా చైర్మన్ సుప్రియా శ్రీనాటే కితాబు ఇచ్చారు. ముఖ్య భూమిక పోషించారంటూ పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా ఉత్సాహంతో పని చేయాలని పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు.
కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు దక్కుతుందన్నారు. భవిష్యత్తులో సరైన అవకాశాలు కల్పిస్తామని ఇందులో ఎలాంటి అనుమానం పడాల్సిన పని లేదన్నారు జైరాం రమేష్.