సర్పంచుల గురించి మాట్లాడం దారుణం
వరంగల్ – రాష్ట్ర మంత్రి దాసరి సీతక్క నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత మీది కాదా అంటూ ప్రశ్నించారు. తాము కొలువు తీరి నెల రోజులు మాత్రమే అయ్యిందని గుర్తు చేశారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కేటీఆర్ కు అలవాటుగా మారిందన్నారు మంత్రి. వెయ్యి పశువులను తిన్న రాబందు నీతి కథలు చెప్పినట్లుగా ఉంది ఆయన మాటల వాలకం చూస్తుంటే అంటూ సెటైర్ వేశారు.
ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలుగా ఉండే గ్రామీణ వ్యవస్థను సర్వ నాశనం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు సీతక్క. సర్పంచ్ లకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన సంగతి మరిచి పోయారా అంటూ నిలదీశారు.
మీరు పెట్టిన బాధలు తట్టుకోలేక చాలా మంది సర్పంచులు మంచాన పడ్డారని , వారి కోసం ఇప్పుడు కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు దాసరి సీతక్క.