చంద్రబాబు పచ్చి మోసగాడు
ఎంపీ కేశినేని నాని కామెంట్స్
అమరావతి – తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశి నాని నిప్పులు చెరిగారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ రాష్ట్రంలో అత్యంత మోసగాడు ఎవరైనా ఉన్నారంటే అది బాబు ఒక్కడేనని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కేశినేని నాని భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను పార్టీని బలోపేతం చేశానని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని అయినా చివరి దాకా తనను ఉండనీయకుండా అన్యాయంగా గెంటేశారంటూ వాపోయారు. తిరువూరులో తనను రౌడీ మూకలతో కొట్టించాలని నారా లోకేష్ ప్లాన్ చేశాడంటూ ఆరోపించారు.
తొమ్మిదేళ్ల కాలంలో తాను ఏమైనా తప్పు చేశానో చెప్పాలని సవాల్ చేశారు. తన కుటుంబంలో కావాలని చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టాడని , తాను పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. ఈసారి ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని జోష్యం చెప్పారు కేశినేని నాని. ఇప్పటికే స్పీకర్ ఫార్మాట్ లో తాను ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ఈమెయిల్ కూడా పంపించానని అన్నారు.
తనతో పాటు తన కూతురు కార్పొరేట్ పదవికి రాజీనామా చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు కేశినేని నాని. త్వరలోనే వైసీపీలో చేరుతానని చెప్పారు. తనకు విజయవాడ అభివృద్ది ముఖ్యమన్నారు. పార్టీ ఏది అన్నది ముఖ్యం కాదన్నారు.