చీపురు పట్టిన కిషన్ రెడ్డి
ఆలయ శుభ్రతలో పాల్గొన్న మంత్రి
హైదరాబాద్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలకు చెందిన ప్రతినిధులు , మంత్రులు, బాధ్యులు ఆలయాలను , ప్రార్థనా మందిరాలను శుభ్రం చేసే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగా బుధవారం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి చీపురు పట్టారు. చెత్తను ఊడ్చే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో. నగరంలోని బషీర్ బాగ్ లో ఉన్న శ్రీ కనక దుర్గా నాగలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు మంత్రి.
అక్కడ రామచంద్రా రెడ్డితో కలిసి చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. విగ్రహాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు తమ తమ ప్రాంతాలలోని ప్రార్థనా మందిరాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు.
దీని వల్ల మరోసారి మనం సంస్కృతికి, నాగరికతకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామనేది ప్రపంచానికి తెలిసేలా చేస్తుందన్నారు జి. కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో శ్రీరాముడి పునః ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురు చూస్తోందన్నారు.