తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.83 కోట్లు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి తండోప తండాలుగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. అయినా భక్త బాంధవుల తాకిడి పెరుగుతూనే ఉంది.
శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ అమ్మ వారిని 76 వేల 58 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 543 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ వెల్లడించింది. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల హుండీ ఆదాయం రూ. 3.83 కోట్లు వచ్చినట్లు తెలిపింది.
స్వామి, అమ్మ వార్ల దర్శనం కోసం ప్రస్తుతం 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని పేర్కొంది. అయితే ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు సంబంధించి కనీసం 8 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మా రెడ్డి తెలిపారు.
భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.